కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం భేటి అయ్యారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలపై కేంద్ర ఆర్థికమంత్రితో చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేసే అవకాశముంది. అలాగే మరికొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ కూడా కోరారు. శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాడ్ జోషిల అపాయింట్ మెంట్ కోరారు. అవి కూడా ఖరారు అయితే వారితో భేటీ అయి.. అనంతరం విజయవాడకు బయలుదేరి వస్తారు. అలాగే శుక్రవారం మధ్యాహ్నం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. కాగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని నేరుగా గురువారం రాత్రి 12.30 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు.