లోకేష్‌పై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత దుర్మార్గమైన వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యారని విమర్శించారు. ఆ సమయంలో టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలను వైసీపీ నేతలు తీవ్రంగా వేధించారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.ఈ సమయంలో యువగళం పాదయాత్ర చేసి పార్టీ నేతలకు, కార్యకర్తలకు లోకేష్ ధైర్యాన్ని ఇచ్చారని చెప్పారు. కూటమికి 164 స్థానాలు రావడంలో లోకేష్ ప్రధాన భూమిక పోషించారని ఉద్ఘాటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీకి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ‘‘ఎవరు వద్దన్నా, కాదన్నా... టీడీపీకి చంద్రబాబు తర్వాత నాయకుడు లోకేష్. ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఈ విషయాన్నే చెబుతాడు... ఇందులో ఏ వివాదం లేదు. ఏ నిర్ణయాలు అయినా కూటమి పెద్దల నిర్ణయం తర్వాతే అమలు చేస్తాం. ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడటం మంచి విధానం కాదు...ఇదీ అందరూ పాటిస్తున్నాం’’ అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.