గుంటూరు నగర పాలక సంస్థలో నిధుల దుర్వినియోగం వివాదం కొనసాగుతోంది. మేయర్ వర్సెస్ కమిషనర్‌గా పరిస్థితి మారిపోయింది. బుడమేరు వరద సాయంపై ఫిర్యాదులు చేసుకోవడంతో పాటు సవాళ్లు చేసుకునే పరిస్థితికి వెళ్లింది వివాదం. వరద సాయం పేరుతో కమిషనర్ పులి శ్రీనివాసులు దోపిడీ చేశారని మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆరోపిస్తున్నారు. అయితే మేయర్ ఆరోపణలను కమిషనర్ కొట్టిపారేస్తున్నారు. తొమ్మిది కోట్ల వరకు వరద సాయం చేసినట్లు కమిషనర్ లెక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో కమిషనర్‌కు మేయర్ సవాల్ విసిరారు. దమ్ముంటే వరద సాయం వివరాలను ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు.ఈరోజు మధ్యాహ్నం వరకు ఛాంబర్‌లోనే ఉంటానని.. తన ఛాలెంజ్‌ను కమిషనర్ స్వీకరించి వరద సాయం లెక్కలను చూపించాలని స్పష్టం చేశారు. చెప్పిన ప్రకారమే గురువారం ఉదయం 11 గంటల నుంచి రెండు గంటల వరకు మేయర్ తన ఛాంబర్‌లోనే కమిషనర్ కోసం వేచి చూశారు. కమిషనర్ వచ్చి వివరాలు ఇస్తారా అనేదానిపై నగర పాలక సంస్థలోనూ ఆసక్తి నెలకొంది. అయితే కమిషనర్ మాత్రం అక్కడకు రాలేదు. దీన్నిబట్టి వరద సహాయ నిధులను దోపిడీ చేశారని అర్థమవుతోందన్నారు. వరద సహాయ నిధులను మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు దోచేశారని ఆరోపణలు గుప్పించారు. అదంతా ప్రజల సొమ్ము అని.. కమిషనర్ ప్రజలకు లెక్క చెప్పాల్సి ఉందని డిమాండ్ చేశారు.