అరకులోయ పరిసర ప్రాంతాలు అడ్వంచర్ పారాగ్లైడింగ్కు ఎంతో అనుకులంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్ అన్నారు. అరకు చలి ఉత్సవ్‌లో భాగంగా తొలిరోజు శుక్రవారం మాడగడ సన్‌రైజ్ హిల్స్‌లో పారాగ్లైడింగ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అరకులోయలో అడ్వంచర్ పారాగ్లైడింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రపంచ స్థాయి పారాగ్లైడింగ్‌లో అనుభవం ఉన్న వారిని అరకు చలి ఉత్సవ్‌కు ఆహ్వానించామన్నారు. ఉత్సవ్‌కు ముందు వారు అరకు ప్రాంతంలో పలు ప్రదేశాలను పరిశీలించి, మాడగడ సన్‌రైజ్ హిల్స్ అనుకూలంగా ఉందని గుర్తించారన్నారు.
అరకు ఉత్సవ్‌లో పారాగ్లైడింగ్‌తోపాటు పర్యాటకులు టేండమ్ గ్లైడింగ్‌లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. పారాగ్లైడింగ్‌లో స్థానిక గిరిజన యువతకు ప్రత్యేక శిక్షణను ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. మార్చి నెలాఖరులో 20 మంది పారాగ్లైడింగ్‌లో అనుభవం ఉన్న వారితో ప్రత్యేక రెక్కీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. వారిచ్చే నివేదిక మేరకు భవిష్యత్తులో అంతర్జాతీయ పారాగ్లైడింగ్ ఈవెంట్స్‌ను అరకులోయలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.