గత కొన్ని రోజులుగా దేశంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి నెలకొన్న ఉత్కంఠ వీడింది. రాజకీయ పార్టీలు, దేశ ప్రజలు ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల తేదీలు వెలువడ్డాయి. లోక్‌సభతోపాటు దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత 17 వ లోక్‌సభ పదవీకాలం ఈ ఏడాది జూన్ 16 వ తేదీన ముగియనుంది. ఆలోపు ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పదవీ కాలం ముగియనుండటంతో అన్నింటికీ కలిపి ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ కారణాలతో తలెత్తిన ఉపఎన్నికలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 26 అసెంబ్లీ ఎన్నికలకు బై ఎలక్షన్స్ జరగనున్నాయి. జూన్ 4 వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.
543 లోక్‌సభ నియోజకరవర్గాలకు ఎన్నికలు 7 దశల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19 వ తేదీన తొలి విడత పోలింగ్, ఏప్రిల్ 26 వ తేదీన 2 వ విడత పోలింగ్, మే 7 వ తేదీన మూడో దశ పోలింగ్, మే 13 వ తేదీన నాలుగో విడత పోలింగ్, మే 20 వ తేదీన ఐదో దశ పోలింగ్, మే 25 వ తేదీన ఆరో దశ పోలింగ్, చివరిగా జూన్ 1 వ తేదీన ఏడో దశ పోలింగ్ జరగనుంది. ఇక నాలుగో దశలో మే 13 వ తేదీన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు తొలి దశలో ఏప్రిల్ 19 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు 13 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అన్ని ఎన్నికల కౌంటింగ్ జూన్ 4 వ తేదీన నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు.
మొదటి దశలో దేశంలోని 21 రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు, రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు, మూడో దశలో 12 రాష్ట్రాల్లోని 94 లోక్‌సభ స్థానాలకు, నాలుగో దశలో 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు, ఐదో దశలో 8 రాష్ట్రాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు, ఆరో దశలో 7 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు, ఏడో దశలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, చండీఘర్, డామన్ డయ్యూ, ఢిల్లీ, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కేరళ, లక్షద్వీప్, లడఖ్, మిజోరం, మేఘలాయ, నాగలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్ ఇలా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే దశలో పోలింగ్ జరనుంది.
ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్ ప్లీనరీ హాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌తో పాటు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధులతో కలిసి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు సీఈసీ వెల్లడించారు. ఈసారి దేశవ్యాప్తంగా 1.82 కోట్ల మంది కొత్త ఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు మొత్తం 19.47 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఇక 85 ఏళ్లు దాటినవారికి వర్క్ ఫ్రమ్ ఓట్ అవకాశం కల్పిస్తున్నట్లు సీఈసీ వెల్లడించారు.
ఏప్రిల్ 1 వ తేదీవరకు ఓటర్ల జాబితాలో తప్పులను సరిచేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో దేశవ్యాప్తంగా మొత్తం 1.50 కోట్ల మంది సిబ్బంది పాలు పంచుకోనున్నారు. దేశవ్యాప్తంగా 10.50 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 55 లక్షల ఈవీఎంలను వినియోగించనున్నారు. 4 లక్షల వాహనాలను ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 2100 మంది ఎన్నికల అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. భారత్‌లో ఎన్నికల నిర్వహణ ఒక పెద్ద ప్రక్రియ అని అందుకోసం ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో హెలికాప్టర్లను, ఏనుగులను, ఒంటెలను ఉపయోగిస్తున్నామని.. ఎన్నికల సిబ్బంది నీటి ప్రవాహాలను, ఎడారి మార్గాల్లో ప్రయాణం చేసేందుకు వీటిని వినియోగిస్తామని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాల్లో ఓటింగ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. సీ-విజిల్ యాప్ ద్వారా దేశపౌరులు ఎవరైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. టీవీ, సోషల్ మీడియా ప్రకటనలపై నిరంతరం పర్యవేక్షణ ఉంచుతామని స్పష్టం చేశారు. వాలంటీర్లు, తాత్కాలిక సిబ్బందిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా నగదు ప్రవాహంపై కూడా దృష్టి పెట్టామని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రూ.3400 కోట్ల డబ్బును సీజ్ చేసినట్లు గుర్తు చేశారు. ఐటీ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో కలిసి నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో చిన్న పిల్లలను భాగం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
2019 సార్వత్రిక ఎన్నికలకు ఆ ఏడాది మార్చి 18 వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2019 లో మొత్తం 7 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీతోపాటు లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలోనే ఏప్రిల్ 11 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ నిర్వహించారు. దేశంలో 7 విడతల్లో పోలింగ్ పూర్తయిన తర్వాత 2019 మే 23 వ తేదీన ఎన్నికల ఫలితాలను విడుదల చేశారు.