కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాను మళ్లీ తాజాగా ఒమిక్రాన్ కేసులు వెంటాడుతున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో పలు దేశాలు సరిహద్దులను తెరిచి, టూరిస్ట్‌లకు ఆహ్వానం పలుకుతుంటే.. చైనాలో మహమ్మారి విజృంభించడం కలవరానికి గురిచేస్తోంది. రెండేళ్ల తర్వాత అక్కడ కొత్త కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో 13 నగరాల్లోని 3 కోట్ల మందికిపైగా ప్రజలు లాక్‌డౌన్‌లో మగ్గుతున్నారు. రోజు రోజుకూ కేసులు రెట్టింపు కావడంతో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్-వేరియంట్ బీఏ.2 (స్టెల్త్ ఒమిక్రాన్) అక్కడ వేగంగా వ్యాప్తిచెందుతోంది. చైనాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఝంగ్ వెన్‌హంగ్ మాట్లాడుతూ... ప్రస్తుతం కరోనా వ్యాప్తికి ఒమిక్రాన్ ఉపవర్గం స్టెల్త్ ఒమిక్రాన్ లేదా బీఏ.2 వేరియంట్ కారణమని అన్నారు. ఇది అసలు వేరియంట్ ఒమిక్రాన్ కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందగలదని తెలిపారు. సాధారణ కరోనా కంటే ఒమిక్రాన్ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందితే.. ఇది దాని కంటే 1.5 రెట్లు వేగంగా సాంక్రమించగలదని వెన్‌హంగ్ పేర్కొన్నారు. చైనాను వణికిస్తున్న ‘స్టెల్త్ ఒమిక్రాన్’ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో శోధిస్తున్నారు. అత్యధిక సాంక్రమిక శక్తి ఉన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉపవర్గం ‘BA.2’ను ‘స్టెల్త్ ఒమిక్రాన్’గా పిలుస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఒమిక్రాన్ BA.1, BA.2, BA.3 అనే మూడు ఉపవర్గాలుగా మార్పు చెందింది. ఒమిక్రాన్ వేరియంట్ ఊపిరితిత్తులకు బదులుగా ఎగువ శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్ఓ గతంలో చెప్పింది. ఓమిక్రాన్ రూపాంతరం సాధారణ-జలుబు వంటి లక్షణాలకు దారి తీస్తుంది. దానితో పాటు తల తిరగడం, అలసట ప్రారంభ దశ లక్షణాలు. వైరస్ సోకిన రెండు మూడు రోజుల్లో ఇతర లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, తీవ్రమైన అలసట, దగ్గు, గొంతులో మంట, తలనొప్పి, కండరాళ్ల నొప్పులు, హృదయ స్పందన రేటు పెరగడం వంటి లక్షణాలు ఉంటాయి. BA.2 వేరియంట్‌లో రుచి, వాసన కోల్పోవడం, ఊపిరి ఆడకపోవడం వంటివి ఉండకపోవచ్చు. యూకేకు చెందిన జో కోవిడ్ యాప్ అధ్యయన ప్రకారం ఒమిక్రాన్ ఉప-వేరియంట్ BA.2 అత్యంత నివేదించి లక్షణాలలో జలుబు ఒకటి. BA.2 ఊపిరితిత్తులను ప్రభావితం చేయకపోవడం వల్ల వాసన లేదా రుచి కోల్పోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉండవని నిపుణులు అంచనా వేస్తున్నారు. సబ్-వేరియంట్ ఒమిక్రాన్ కంటే సులభంగా వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. ఇది ఇప్పటికే అనేక దేశాలకు వ్యాపించిందని, రాబోయే రోజుల్లో పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతాయని భావిస్తున్నారు. మనల్ని మనం రక్షించుకోడానికి ఏకైక మార్గం టీకాలు తీసుకోవడం, కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించడం.