అమెరికా తీరును చైనా మరోసారి తపుపట్టింది. రష్యాకు సహకరిస్తే ఊరుకునేది లేదని అమెరికా హెచ్చరించింది. దానిపై చైనా ప్రతిస్పందిస్తూ తమను రష్యా ఏ విధమైన సహాయాన్ని కోరలేదని వివరణ ఇచ్చింది. దాంతో ఆ రగడకు అక్కడతో తెరపడినట్టైంది. అయితే యుద్ధంపై చైనా మళ్లీ తన గళాన్ని విప్పింది. రష్యాపై అమెరికా పెడుతున్న ఆంక్షల వల్ల అందరికీ నష్టం జరుగుతుందని, మాకు హక్కులు ఉన్నాయని చైనా.. అమెరికాకు గుర్తు చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాతో వ్యవహరించేటపుడు తమ చట్టబద్ధ హక్కులు ప్రభావితం కాకుండా జాగ్రత్త వహించాలని చైనా కోరింది. యుద్ధం కారణంగా అమెరికా విధిస్తున్న ఆంక్షల వల్ల అందరికీ నష్టం జరుగుతుందని చైనా తెలిపింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం స్పానిష్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయేల్ అల్బేర్స్‌తో ఫోన్‌లో ద్వారా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో చైనాకు ఎటువంటి సంబంధం లేదని, అందులో చైనా పాత్రే లేదని ఆయన చెప్పారు. అయితే పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆంక్షల ప్రభావం చైనాపై పడాలని తాము కోరుకోవడం లేదని, చట్టబద్ధ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునే హక్కు చైనాకు ఉందని చెప్పారు. నిజానికి ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలై 20వ రోజుకు చేరుకుంది. రష్యాను ఆపడానికి పశ్చిమ దేశాలు, అమెరికా సైతం ఆంక్షలు విధిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు, వాణిజ్యపరమైన అంశాలపై కూడా ఆంక్షలుపెట్టాయి. ఈ నేపథ్యంలో రష్యా.. చైనా సైనిక, ఆర్థిక అంశాల్లో సహాయం కోరిందనే వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో చైనాకు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. రష్యాకు చైనా సహకరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే ఈ విషయంపై చైనా కూడా చాలా కూల్‌గానే స్పందించింది. రష్యాకు ఎలాంటి సహాయాన్ని పంపడం లేదని, అసలు రష్యా తమను సాయమే అడగలేదని చైనా చెప్పింది. ఈ క్రమంలో మళ్లీ చైనా రియాక్ట్ అవ్వడం పలు అనుమానాలకు తావు ఇస్తుంది. చైనా ఏ ఉద్దేశంతో ఈ మాటలు చెప్పిందనేదానిపై సందేహాలు ఊపందుకున్నాయి. హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునే హక్కు తమకు ఉందని చెబుతూ అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రష్యా తరఫున నిలబడ్డానికి చైనా మార్గం వేసుకుంటందనే ఊహాగానాలు మొదలయ్యాయి.