మరోసారి అధికారం చేపట్టిన యోగి సర్కార్ తన రాష్ట్ర ఆర్థిక పురోగతిపై నజర్ పెట్టింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయంటే చాలు.. దేశంలోని ప్రతి ఒక్కరి చూపు ఆ రాష్ట్రం వైపే ఉంటుంది. జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో గెలిచిన పార్టీకే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశాలు మెండుగా ఉండటమే దీనికి కారణం. యూపీ జనాభా 20 కోట్లకుపైమాటే. ఇది ప్రపంచంలోని చాలా దేశాల జనాభా కంటే ఎక్కువ. ఇన్నాళ్లూ రాజకీయ పక్షాలు యూపీని ఎన్నికల కోణంలో చూడగా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం దేశ ఆర్థిక కలలను సాకారం చేసే అతిపెద్ద రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్‌ను చూస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి తిరిగి యూపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్.. వచ్చే ఐదేళ్లలో యూపీని లక్ష డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఆయన ప్రభుత్వం ప్రయివేట్ కన్సల్టెంట్ సహాయం తీసుకుంటోంది. కన్సల్టెంట్ల కోసం యోగి ప్రభుత్వం 2020లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. డెలాయిట్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, ఐఐఎం లక్నో తదితర 8 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. కానీ ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో యోగి సర్కారు కొత్త బిడ్లను ఆహ్వానిస్తోంది. ఏప్రిల్ 14 వరకు బిడ్లు వేసే అవకాశం కల్పించింది. 2021-22లో ఉత్తర ప్రదేశ్ జీఎస్‌డీపీ 21.27 లక్షల రూపాయలు. డాలర్లలో చెప్పాలంటే.. 270 బిలియన్ డాలర్లు. 2027 నాటికి లక్ష డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే.. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ కంటే దాదాపు నాలుగు రెట్లు పెరగాల్సి ఉంటుంది. ఈ లక్ష్య సాధనలో యోగి సర్కారు విజయం సాధిస్తే.. భారత్‌ను 5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేయాలన్న మోదీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం ఖాయం. కానీ ఇదేమీ అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లకు చేరవలో ఉండగా... అందులో యూపీ వాటా కేవలం 8 శాతం మాత్రమే. భారత ఎకానమీ 5 లక్షల డాలర్లకు చేరుకునే లోగా.. యూపీ ఎకానమీ లక్ష డాలర్లకు చేరాలంటే.. దేశ జీడీపీలో ఆ రాష్ట్ర వాటా 20 శాతానికి పెరగాల్సి ఉంటుంది. ఆ దిశగా యోగి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.