పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఆయన అభిమానుల్లో ఉన్న క్రేజ్ ఏమిటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్ కల్యాణ్, రానా నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా నిన్న విడుదలైన విషయం తెలిసిందే. థియేటర్ల వద్ద పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేస్తోన్న హంగామా మామూలుగా లేదు. థియేటర్ల వద్ద భారీగా కనపడుతున్నారు. సినిమాకు హిట్ టాక్ రావడంతో మరింత ఖుషీ అవుతున్నారు. డ్యాన్సులు, కటౌట్లకు పాలాభిషేకాలు, టపాసులు పేల్చుతూ థియేటర్ల వద్ద హోరెత్తిస్తున్నారు. వారిలో సంగీత దర్శకుడు తమన్ కలిసిపోయారు. ఈ సినిమాకు ఆయనే సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఓ థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్లిన తమన్.. లాల్ లాల్ భీమ్లా పాట వస్తోన్న సమయంలో తెర వద్దకు వెళ్లి అభిమానులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు. దీంతో అభిమానుల్లో మరింత జోష్ నిండింది. ఈ వీడియోను స్వయంగా తమన్ పోస్ట్ చేశారు. మరోవైపు, రెండో రోజు కూడా ఉదయం నుంచి భీమ్లా నాయక్ ఆడుతోన్న సినిమా హాళ్ల వద్ద అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కొన్ని థియేటర్ల వద్ద ఇసుకవేస్తే రాలనంత జనం కనపడుతుండడం విశేషం. ఏపీలో థియేటర్లపై కఠిన నిబంధనలు అమలు అవుతున్నప్పటికీ భారీగానే కలెక్షన్లు వస్తున్నాయి. కరోనా ప్రభావం కూడా తగ్గడంతో జాతరకు తరలివస్తున్నట్లు ప్రేక్షకులు భీమ్లా నాయక్ సినిమాను చూడడానికి వస్తున్నారు. కాగా, సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa