ఇటీవల అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' పాన్ ఇండియా సినిమాగా రిలీజై వసూళ్ల సునామీని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకోవటమే కాక మిగిలిన చిత్ర పరిశ్రమల వైపు కూడా తన దృష్టిని మళ్ళించాడు. ముఖ్యంగా బాలీవుడ్లో పుష్ప క్రేజ్ మామూలుగా లేదు. బాలీవుడ్ జనాలు పుష్ప మానియాతో ఊగిపోతున్నారు. దీంతో బాలీవుడ్లో కూడా జెండా పాతాలని బన్నీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అందుకు నిదర్శనం... నిన్న జరిగిన అల్లు అర్జున్- సంజయ్ లీలా భన్సాలీ ల భేటీ.
బాలీవుడ్ దిగ్గజ దర్శకులలో ఒకరు సంజయ్ లీలా భన్సాలీ. ఆయన తెరకెక్కించిన దేవదాస్, బ్లాక్, పద్మావత్, రామ్ - లీలా, బాజీరావ్ మస్తానీ సినిమాలు బాలీవుడ్ క్లాసిక్స్ గా నిలిచాయి. ఇటీవల ఆయన తెరకెక్కించిన గంగూభాయ్ కతియావాడి కూడా సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలో భన్సాలీతో బన్నీ సమావేశమవటం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆయనతో ఒక ప్రాజెక్టుకు బన్నీ ఓకే చెప్పినట్లు చిత్రవర్గ సమాచారం. అది కూడా ఒక పీరియాడికల్ మూవీ అని, అందులో బన్నీ దక్షిణాదికి చెందిన ఒక యోధుడి పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయాలన్నిటిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. కానీ ఈ కాంబోలో వచ్చే సినిమా మాత్రం అదిరిపోయే రేంజులో ఉండటం ఖాయమని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa