by Suryaa Desk | Sat, Dec 21, 2024, 03:41 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తండ్రి పేరు చెప్పుకుని తాను ఈ స్థాయికి రాలేదని చెప్పారు. ఒక్కొక్కడిని తొక్కుకుంటూ ఇక్కడి వరకు వచ్చానని అన్నారు. రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతుబంధు అమలులో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. శాసనసభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు, సాగులో లేని భూమి రైతులకు కూడా రైతుబంధు ఇచ్చారని మండిపడ్డారు. రోడ్డు విస్తరణ పనుల్లో పోయిన భూములకు కూడా రైతుబంధు ఇచ్చారని దుయ్యబట్టారు. రాళ్లకు, రప్పలకు కూడా రైతుబంధు ఇద్దామా? అని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రం సర్వనాశనమయిందని రేవంత్ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారని... మళ్లీ రాళ్లకు, రప్పలకు రైతుబంధు ఇవ్వాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ను ఆదర్శంగా తీసుకుని ఉంటే తాము కూడా ప్రతిపక్షంలో ఉండేవాళ్లమని చెప్పారు. 2024లో డిపాజిట్లు కోల్పోయిన మీరు మాకు ఆదర్శం కాదని అన్నారు. శాసనసభలో బీఆర్ఎస్ నేతలు చిల్లరగా వ్యవహరించినా తాము ఓపికగా ఉన్నామని రేవంత్ చెప్పారు. అబద్ధాలకు అధ్యక్షుడు కేసీఆర్ సభకు రావడం లేదని, ఉపాధ్యక్షుడు కేటీఆర్ వస్తున్నారని అన్నారు. అర్ధరాత్రి ఓఆర్ఆర్ ను అమ్మి రెండో విడత రుణమాఫీ నిధులిచ్చారని విమర్శించారు. స్విస్ బ్యాంకుకు కూడా అప్పు ఇచ్చే స్థాయికి బీఆర్ఎస్ చేరుకుందని... ఆ పార్టీ తలుచుకుంటే రూ. 7 లక్షల కోట్ల రాష్ట్ర అప్పు కూడా తీర్చేస్తుందని రేవంత్ అన్నారు. రాష్ట్ర సంపద మొత్తం బీఆర్ఎస్ నేతల వద్దే ఉందని చెప్పారు. 16 మంది సీఎంలు చేసిన అప్పు రూ. 72 వేల కోట్లు అయితే... ఒక్క కేసీఆర్ మాత్రమే రూ. 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకున్న ఆర్థిక ఉగ్రవాదులను వదిలి పెట్టాలా? అని ప్రశ్నించారు.