by Suryaa Desk | Sat, Dec 28, 2024, 10:49 AM
ఈ నెల 31న నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాల వేళలను పొడిగించారు. 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలోని అన్ని బార్‌లు, రెస్టారెంట్లు, ఈవెంట్‌లు, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ హోటళ్లలో తెల్లవారుజామున 1 గంట వరకు మద్యం విక్రయించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.అదే విధంగా అన్ని వైన్ షాపులను ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని వెల్లడించింది. ఈ వేడుకల్లో డ్రగ్స్ వాడకుండా, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యం అమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే కార్యక్రమాలు, పార్టీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇటీవల జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సిబ్బందికి సూచించారు.