|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 09:11 PM
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతోంది. హైదరాబాద్ యూసుఫ్‌గూడలో జరిగిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటు ఆందోళనకరంగా ఉందని.. దీనికి మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడమే ప్రధాన కారణాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి ఒక కీలక ప్రతిపాదన చేశారు. ఇకపై ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి రాయితీలు లేదా డిస్కౌంట్లు ఉండవని స్పష్టం చేశారు. డిస్కౌంట్లు ఇస్తారనే ధీమాతో వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా.. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలోనే యజమాని బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయాలని సూచించారు. ఏదైనా నిబంధన అతిక్రమిస్తే.. జరిమానా మొత్తం నేరుగా బ్యాంకు ఖాతా నుండి కట్ అయ్యేలా సాంకేతికతను తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కేవలం జరిమానాలతోనే సరిపెట్టకుండా.. వ్యవస్థీకృత మార్పుల కోసం సిద్ధమవ్వాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మైనర్ల వల్ల ప్రమాదాలు జరిగితే ఆ బాధ్యత వారి సంరక్షకులదేనని.. వారిపైనే కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.
రోడ్డు భద్రత విభాగంలో పనిచేయడాన్ని శిక్షగా భావించే ధోరణిని మార్చాలని సీఎం అన్నారు. ఇకపై ఈ విభాగానికి డీజీ లేదా అడిషనల్ డీజీ స్థాయి అధికారులను నియమించి.. ఈ రంగాన్ని హైడ్రా లేదా సైబర్ క్రైమ్ విభాగాల తరహాలో శక్తివంతంగా మారుస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు సరిపోవని.. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన రవాణా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రోడ్డు ప్రమాద మరణాలను కేవలం ప్రమాదాలుగా చూడకుండా.. నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న హత్యలుగానే పరిగణించాలన్నారు.
ట్రాఫిక్ క్రమశిక్షణ అనేది పాఠశాల దశ నుంచే అలవడాలని... విద్యార్థుల సిలబస్‌లో రోడ్డు భద్రత అంశాలను చేర్చాలని విద్యాశాఖకు సూచించారు. రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే రోడ్డు ప్రమాద రహిత తెలంగాణ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.