|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 09:16 PM
తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళంగా, పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖను కేవలం ఆదాయ వనరుగా మాత్రమే కాకుండా.. ప్రజలకు నాణ్యమైన సేవలందించే కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కీలక సంస్కరణలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 'సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల' నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండలంలో ఎస్.ఎస్.ఆర్ బిల్డర్స్ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు దశల్లో ఈ భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.
తొలి విడతలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించారు. ఈ భవనాల నిర్మాణానికి ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా.. ప్రైవేట్ బిల్డర్ల భాగస్వామ్యంతో వీటిని నిర్మిస్తున్నారు. విశేషమేమిటంటే, ఈ భవనాలను నిర్మించిన సంస్థలే ఐదేళ్ల పాటు వాటి నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. గచ్చిబౌలిలోని 'తాలిమ్' భవనంలో నిర్మిస్తున్న కార్యాలయం ఈ ఏడాది జూన్ 2 నాటికి ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
కేవలం భవనాలే కాకుండా, భూముల వ్యవహారాల్లోనూ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచిస్తోందని మంత్రి తెలిపారు. గతంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం ఒకవేళ అభివృద్ధి పనుల కోసం సేకరించాల్సి వస్తే, ఆ పేదలకు తగిన పరిహారం చెల్లించడంతో పాటు ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
కొత్తగా నిర్మించే సమీకృత భవనాల్లో కేవలం ఆఫీస్ గదులే కాకుండా, రిజిస్ట్రేషన్ కోసం వచ్చే మహిళలు, పసిబిడ్డల తల్లులు, వృద్ధుల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాల్స్, మౌలిక సదుపాయాలు కల్పించనున్నాట్లు తెలిపారు. తద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీసులంటే ఉండే పాతకాలపు గందరగోళం పోయి, కార్పొరేట్ ఆఫీసుల తరహాలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని చెప్పారు. ఇక మేడారం జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొంగులేటి ప్రజలను ఆహ్వానించారు.