|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 12:38 PM
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కన్న తల్లిదండ్రుల బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అలాంటి ఉద్యోగుల జీతంలో 10 శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా త్వరలోనే ఒక ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వృద్ధులైన తల్లిదండ్రులు తమ పిల్లలపై చేసే ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలని ఆయన అధికారులను ఆదేశించారు.సోమవారం నాడు దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేసే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా రెట్రోఫిట్టెడ్ వాహనాలు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, ల్యాప్‌టాప్‌లు, వినికిడి పరికరాలు వంటివి పంపిణీ చేశారు. ఈ కొత్త పథకానికి ప్రభుత్వం రూ. 50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే, వయోవృద్ధుల కోసం 'ప్రణామ్' పేరుతో డేకేర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి కార్పొరేషన్‌లో ఒక కో-ఆప్షన్ సభ్యుడి పదవిని ట్రాన్స్‌జెండర్లకు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వారి సమస్యలను నేరుగా ప్రస్తావించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని అన్నారు. దీనితో పాటు, 2026-27 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో నూతన ఆరోగ్య విధానాన్ని ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.