![]() |
![]() |
by Suryaa Desk | Sun, Mar 30, 2025, 05:18 PM
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తూ దేశ విభజనకు కుట్రలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. దేశ విభజన దిశగా కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఉగాది పండుగ సందర్భంగా కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల పేరుతో దేశాన్ని విడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మతం పేరుతో దేశాన్ని విభజించిందని ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పేరుతో దేశ విభజనకు కుట్ర చేస్తోందని విమర్శించారు. కుట్ర చేస్తున్న వాళ్లను రాళ్లతో కొట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పగ తీర్చుకునే రాజకీయాలు చేయబోమంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే అనే విషయం అర్థమవుతోందని అన్నారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని అవినీతికి పాల్పడ్డ వారిని జైలుకు పంపించాలని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సన్నబియ్యం ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని. కానీ, వాటిని ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమని అన్నారు. కేజీ బియ్యం మీద కేంద్ర ప్రభుత్వం రూ. 40 ఖర్చుస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ. 10 మాత్రమే ఖర్చు చేస్తోందని చెప్పారు. అందుకే ఈ పథకంపై ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని అన్నారు.