![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 11:11 AM
భాగ్యనగరంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిసర ప్రాంతాలు మాత్రమే స్వచ్ఛమైన గాలిని అందించే ప్రదేశాలుగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భవిష్యత్తులో పశ్చిమ హైదరాబాద్ ఢిల్లీ మాదిరిగా వాయు కాలుష్యంతో నిండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని భూమిని సంరక్షించగలిగితే హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తుల్లా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.400 ఎకరాల భూమిని విక్రయించి రూ. 30 వేల కోట్లు సంపాదించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ భూములను విక్రయించడానికి వారికి ఏం హక్కు ఉందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీ కోసం 45 వేల ఎకరాలను సిద్ధం చేస్తున్నప్పుడు, ఈ 400 ఎకరాలు ఎందుకని నిలదీశారు. హైకోర్టులో పిటిషన్ విచారణకు రాకముందే భూమిని చదును చేస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భూములను చదును చేస్తోందని మండిపడ్డారు.వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, అడ్డుకునే వారిని కొడుతూ, మహిళల పట్ల దుశ్శాసన పర్వాన్ని తలపిస్తూ భూమిని చదును చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ జరుగుతున్న అన్యాయం తమకు కనపడటం లేదా, వినపడటం లేదా అని నెమళ్లు సహా వివిధ జంతువులు ప్రశ్నిస్తున్నాయని అన్నారు. హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.