|
|
by Suryaa Desk | Fri, Oct 31, 2025, 09:51 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తరఫున ఈరోజు రోడ్డు షో నిర్వహించారు. మరో పది రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఓటింగ్ జరగనున్నందున, ఆయా పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో కేటీఆర్ షేక్‌పేట డివిజన్‌లో ప్రచారం చేశారు. ఓయూ కాలనీ మీదుగా వినోభానగర్ వరకు రోడ్డు షో కొనసాగింది.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, హిట్లర్ నశించడాన్ని చూశామని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నాళ్లు ఉంటుందో చూస్తామని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని, ఒకవేళ ఓటమి ఎదురైతే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లు కూల్చడమా అని ప్రశ్నించారు. ఒకప్పుడు ఇందిరమ్మ పేదరికాన్ని నిర్మూలించాలని నినదిస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పేదోళ్లను రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు.మాగంటి సునీత మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఒక కుటుంబమని గోపీనాథ్ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మహిళలకు అండగా ఉంటూ సమస్యలు పరిష్కరించేవారని అన్నారు. కష్ట సమయాల్లో ప్రజలకు అండగా నిలబడ్డారని తెలిపారు. ఎవరికీ భయపడవద్దని, ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.