|
|
by Suryaa Desk | Sat, Nov 01, 2025, 10:30 PM
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదెల్లి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడిపై విజిలెన్స్ పోలీసులు రూ.7,851 జరిమానా విధించడంతో పాటు కేసు నమోదు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం ఇందిరమ్మ ఇల్లు కింద పాత ఇంటిని కూల్చివేసి అదే స్థలంలో కొత్తగా ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఇప్పటికే రెండు విడుతల్లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు కూడా జమ అయ్యాయి. అయితే లబ్ధిదారుడు నిర్మాణ పనుల కోసం తన పాత గృహజ్యోతి మీటర్‌నే వినియోగించడం ఈ వివాదానికి మూల కారణమైంది.
లబ్ధిదారుడు తన పాత ఇంటికి ఉన్న విద్యుత్ మీటర్‌ను కొత్త ఇంటికి వాడుకుంటున్నాడు. జీరో బిల్లు వచ్చే గృహజ్యోతి పథకం కింద ఉన్న మీటర్‌ను కొత్త ఇంటి నిర్మాణానికి ఉపయోగిస్తున్నాడు. ఈ మీటర్‌పై విద్యుత్తు శాఖకు ఎలాంటి బకాయిలు లేవు. అక్టోబరు 26వ తేదీన లబ్ధిదారుడి ఇంటి వద్దకు వచ్చిన విజిలెన్స్ పోలీసు అధికారి, నిర్మాణ పనుల కోసం విద్యుత్తు వాడుతున్నందున మీటర్‌ను కేటగిరీ-2 (నిర్మాణ కేటగిరీ) లోకి మార్చుకోలేదని ప్రశ్నించారు. ఇది నిబంధనల ఉల్లంఘనగా పేర్కొన్నారు. తాను విద్యుత్తు చౌర్యానికి పాల్పడడం లేదని, సాధారణ విద్యుత్‌ను మాత్రమే వాడుకుంటున్నానని లబ్ధిదారుడు సమాధానం ఇచ్చినా.. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.
అనంతరం శుక్రవారం (అక్టోబర్ 31న ) విజిలెన్స్ పోలీసులు లబ్ధిదారుడిపై కేసు నమోదు చేయడంతో పాటు రూ.7,851 జరిమానా విధిస్తూ రశీదు పంపించారు. ఈ వ్యవహారంపై ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కేటగిరీ మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే, విజిలెన్స్ అధికారులు ఎందుకు ఈ చర్య తీసుకున్నారో తమకు తెలియదని ఆ వివరాలు వారికే తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం సహాయం అందిస్తున్న సమయంలో, సాంకేతిక నిబంధనల పేరుతో లబ్ధిదారుడిపై కేసు నమోదు చేయడం, భారీ జరిమానా విధించడం స్థానికంగా చర్చనీయాశమైంది. విద్యుత్ వినియోగంపై అధికారులు క్లారిటీ ఇవ్వాలని.. లబ్ధిదారుడికి తగిన న్యాయం జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.