|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 04:55 PM
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నేటి సాయంత్రం అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎమ్ఎస్-03ను ప్రయోగించనుంది. భారత గడ్డపై నుంచి ప్రయోగిస్తున్న ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైనది కావడం విశేషం. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ సజావుగా కొనసాగుతోంది.మొత్తం 4,410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని ‘బాహుబలి’ అనే పేరున్న ఎల్వీఎమ్3-ఎమ్5 రాకెట్ ద్వారా భూస్థిర బదిలీ కక్ష్య లోకి ప్రవేశపెట్టనున్నారు. నేటి సాయంత్రం సరిగ్గా 5.26 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్‌ను జీఎస్ఎల్‌వీ మార్క్-3గా కూడా పిలుస్తారు.సీఎమ్ఎస్-03 ఒక మల్టీ-బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఇది భారత భూభాగంతో పాటు విస్తారమైన సముద్ర ప్రాంతాలకు కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది.