|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 08:41 PM
తెలంగాణలోని పీజీ వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయంతో భారీ ఊరట కల్పించింది. ప్రైవేటు పీజీ వైద్య కళాశాలల్లోని యాజమాన్య కోటా సీట్లలో ఇకపై 85 శాతం సీట్లను స్థానిక (తెలంగాణ) విద్యార్థులకే కేటాయించాలని ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వందల మంది రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
ఇప్పటివరకు ప్రైవేటు పీజీ వైద్య కళాశాలల్లోని యాజమాన్య కోటా సీట్లన్నీ దాదాపుగా అఖిల భారత కోటా విద్యార్థులకే దక్కుతుండటంతో..నిక విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించి.. తక్షణమే స్థానిక విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా జీవో జారీ చేయాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినాకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత జీవో జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ విద్యా సంవత్సరం నుంచి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించబోయే పీజీ కౌన్సెలింగ్‌లో స్థానిక విద్యార్థులకు గణనీయమైన లబ్ధి చేకూరనుంది. అంచనాల ప్రకారం.. రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318 మెడికల్ పీజీ సీట్లు, 70 డెంటల్ పీజీ సీట్లు సహా మొత్తం 388 సీట్లు లభించనున్నాయి. ఇది తెలంగాణ విద్యార్థుల ఉన్నత వైద్యవిద్య అవకాశాలను మెరుగుపరుస్తుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 19 ప్రైవేటు పీజీ వైద్య కళాశాలలు ఉండగా.. వాటిలో సుమారు 1,511 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 50% సీట్లు కన్వీనర్ కోటా కింద స్థానికులకు కేటాయిస్తున్నారు. మిగిలిన 50% సీట్లు యాజమాన్య కోటా (MQ1, MQ2, MQ3) కింద భర్తీ చేస్తారు. ఇందులో MQ1 (25% సీట్లు), MQ2 (ఎన్‌ఆర్‌ఐ), MQ3 (ఇన్‌స్టిట్యూషనల్) కింద మిగతా 25 శాతం సీట్లు ఉంటాయి.
తాజా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఇప్పటివరకు పూర్తిగా ఆల్ ఇండియా కోటాకు కేటాయిస్తున్న MQ1 కోటాలోని 25% సీట్లలో 85% సీట్లను స్థానిక విద్యార్థులకు రిజర్వ్ చేయనున్నారు. ఇప్పటికే ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో స్థానిక విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో 33 తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ తాజా నిర్ణయం ప్రభుత్వ ఉన్నత లక్ష్యానికి నిదర్శనమని వైద్యవర్గాలు పేర్కొన్నాయి.