|
|
by Suryaa Desk | Sun, Nov 09, 2025, 06:22 AM
బీఆర్ఎస్ దివంగత నేత, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆయన గుండెపోటుతో మరణించారని భావిస్తున్న తరుణంలో మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ స్వయంగా ఆయన తల్లే పోలీసులను ఆశ్రయించడం సంచలనం రేపుతోంది. తన కుమారుడి మృతి వెనుక నిర్లక్ష్యం, కుట్ర ఉన్నాయని ఆరోపిస్తూ గోపీనాథ్ తల్లి మాగంటి మహానందకుమారి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.తన కుమారుడు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు, చివరకు జూన్ 8న మరణించినట్లు ప్రకటించిన తర్వాత కూడా తనను చూడనివ్వలేదని మహానంద కుమారి తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. కోడలు మాగంటి సునీత కుమార్తె దిశీరా ఆదేశాల మేరకే ఆసుపత్రి సిబ్బంది తనను అడ్డుకున్నారని తెలిపారు. అయితే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా గోపీనాథ్‌ను కలిశారని, ఈ వివక్ష తన అనుమానాలను మరింత బలపరిచిందని ఆమె పేర్కొన్నారు. కేటీఆర్ వచ్చి వెళ్లేంత వరకు మరణవార్తను అధికారికంగా ప్రకటించలేదని, అసలు ఏం జరిగిందో కేటీఆరే చెప్పాలని ఆమె డిమాండ్ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.కిడ్నీ మార్పిడి తర్వాత వైద్యులు సరైన శ్రద్ధ చూపలేదని, డయాలసిస్‌లో జాప్యం చేశారని మహానంద కుమారి ఆరోపించారు. అంతేకాకుండా గోపీనాథ్‌కు కేటాయించిన గన్‌మెన్‌లు, భద్రతా సిబ్బంది ఆయన కుప్పకూలినప్పుడు అందుబాటులో లేరని, అత్యవసర చికిత్స (సీపీఆర్) అందించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కోడలు సునీత, కేటీఆర్ ఇద్దరూ నిజాలు దాస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు.