|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 09:19 PM
మనలో చాలా మంది నాన్‌వెజ్ ఆహారం అంటే ఇష్టంగా తింటుంటారు. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు ఇలా రకరకాల మాంసాహారాలు మన ఆహారంలో ఉంటాయి. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చాలా ఇళ్లలో నాన్‌వెజ్ వంటకాలు ప్రత్యేకంగా తయారవుతుంటాయి.మటన్‌లోనూ అనేక రకాల వెరైటీలు ఉంటాయి. మేక తలకాయ, కాళ్లు, బోటీతో పాటు మేక రక్తాన్ని కూడా కొందరు ప్రత్యేకంగా వండుకుని తింటారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మేక రక్తం వంటకాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే, మేక రక్తం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో మీకు తెలుసా? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.మానవ రక్తంలాగే మేక రక్తం కూడా హిమోగ్లోబిన్‌తో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఐరన్, విటమిన్ B12, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. మేక రక్తం ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. రక్తహీనతను నివారించడంలో కూడా దోహదపడుతుంది. అంతేకాకుండా జింక్, సెలీనియం, ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఇందులో ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. మేక రక్తంలో దాదాపు 17 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి కండరాల పెరుగుదలకు, శరీర కదలికలకు సహకరిస్తాయి.అయితే, ప్రతి ఒక్కరూ మేక రక్తాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మేక రక్తంలో ప్యూరిన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల గౌట్ సమస్యలు ఉన్నవారిలో ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. గౌట్ మరింత తీవ్రతరం కావడంతో పాటు కీళ్ల నొప్పులు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే గౌట్ లేదా యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు మేక రక్తం తీసుకునే విషయంలో పరిమితంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.