|
|
by Suryaa Desk | Mon, Jan 19, 2026, 06:51 PM
తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖలో దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత సంప్రదాయాలకు స్వస్తి పలుకుతూ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్నతాధికారుల హోదాను ప్రదర్శించే గద్దె సంప్రదాయాన్ని రద్దు చేయడంతో పాటు.. అన్ని కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకే తరలించాలని నిర్ణయించింది. ప్రజలకు, అధికారులకు మధ్య దూరాన్ని తగ్గించి పారదర్శకమైన పాలన అందించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కూర్చునే చోట ఒక ఎత్తైన గద్దెను నిర్మించి.. దాని చుట్టూ ఎరుపు రంగు వస్త్రం కప్పడం బ్రిటిష్ కాలం నాటి ఆచారంగా వస్తోంది. డాక్యుమెంట్ల పరిశీలన సమయంలో అధికారులు ఎత్తులో కూర్చోవడం వల్ల సామాన్య ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై స్పందించిన రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హన్మంతు, రెండు వారాల క్రితమే కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఇకపై సాధారణ టేబుల్, కుర్చీ వేసుకుని నేలపైనే కూర్చొని విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ఇప్పటికే ఈ గద్దెలను తొలగించారు.
రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాల వల్ల ఖజానాపై భారీగా భారం పడుతోంది. దీనిని నివారించేందుకు ఇకపై ఏ శాఖా కార్యాలయం కూడా అద్దె భవనాల్లో ఉండకూడదని ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, భీమ్‌గల్ వంటి పలు ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లోనే నడుస్తున్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వ భవనాలను కేటాయించాలని జిల్లా రిజిస్ట్రార్ ప్రసూన ఇప్పటికే కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ భవనాల్లోకి మారడం వల్ల కేవలం అద్దె ఆదా అవ్వడమే కాకుండా.. ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించే వీలుంటుంది. పార్కింగ్ సమస్యలు, వెయిటింగ్ హాల్స్ లేకపోవడం వంటి ఇబ్బందులకు తావుండదు. నిజామాబాద్ అర్బన్ వంటి కొన్ని చోట్ల సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతున్నప్పటికీ.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ.. డిజిటల్ సేవలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. కార్యాలయాల తరలింపు పూర్తయితే సామాన్యులకు సేవలు మరింత వేగంగా అందుతాయని భావిస్తున్నారు.