|
|
by Suryaa Desk | Wed, Jan 14, 2026, 09:00 PM
కూకట్‌పల్లిలోని నల్లచెరువు వద్ద బుధవారం పండుగ వాతావరణం నెలకొంది. ఒకప్పుడు మురికి, దుర్గంధంతో నిండిన ఈ ప్రాంతం ఇప్పుడు పతంగుల పండుగతో సందడిగా మారింది. స్థానికుల ఆహ్వానం మేరకు ఈ కైట్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా హాజరైన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, స్వయంగా పతంగి ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. పిల్లలు, యువకులతో కలిసిపోయి ఉత్సాహంగా పతంగిని గాలిలోకి వదిలిన ఆయన, తన బాల్య, యవ్వన స్మృతులను గుర్తుచేసుకున్నారు.ఈ సందర్భంగా ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ 2024 సెప్టెంబరులో చెరువు విస్తరణ పనులు ప్రారంభించినప్పుడు ఇక్కడ తీవ్ర నిరసనలు ఎదుర్కొన్నాం. కానీ ఈ రోజు ఇక్కడి ప్రజల ముఖాల్లో ఆనందం, పండుగ వాతావరణం చూడటం ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు. కబ్జాల కారణంగా 16 ఎకరాలకు కుంచించుకుపోయిన నల్లచెరువును, పూడికతీత పనులు చేపట్టి ఏకంగా 30 ఎకరాలకు విస్తరించామని తెలిపారు. దాదాపు 10 అడుగుల లోతు పేరుకుపోయిన పూడికను తొలగించి, చెరువు లోతు పెంచడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని వివరించారు.కేవలం పైపై మెరుగులు దిద్దడం కాదు, చెరువుల అభివృద్ధి అంటే ఎలా ఉండాలో చేసి చూపించాం. ఇప్పుడు ఈ చెరువును చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది. 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వాకింగ్ కోసం వస్తున్నారని తెలిసి చాలా ఆనందించాను అని అన్నారు.త్వరలోనే ఈ చెరువు వద్ద షటిల్ కోర్టు, కమ్యూనిటీ హాల్, యోగా కేంద్రం, సైకిల్ ట్రాక్, పికిల్ బాల్ వంటి క్రీడా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తామని, వీటన్నింటినీ ప్రజలు ఉచితంగా వినియోగించుకోవచ్చని రంగనాథ్ హామీ ఇచ్చారు. హైడ్రా ఆధ్వర్యంలో మొదటి విడతలో 6 చెరువుల అభివృద్ధి చేపట్టగా, ఇప్పటికే బతుకమ్మకుంటను ప్రారంభించామని, మరో 3 చెరువులను ఫిబ్రవరిలోగా ప్రారంభిస్తామని చెప్పారు. వీటికి అదనంగా మరో 14 చెరువులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, త్వరలోనే ఆ పనులు కూడా మొదలుపెడతామని ప్రకటించారు. నగరంలో వంద చెరువులను అభివృద్ధి చేస్తే వరదలను నియంత్రించవచ్చని, భూగర్భ జలాలు పెరిగి మంచి నీరు అందుబాటులోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.చెరువు అభివృద్ధి పట్ల స్థానిక నివాసితులు హర్షం వ్యక్తం చేశారు.చెరువును ఈ స్థాయిలో అభివృద్ధి చేస్తారని మేము కలలో కూడా ఊహించలేదు. దుర్గంధభరిత వాతావరణాన్ని తొలగించి ఆహ్లాదాన్ని నింపిన ప్రభుత్వానికి, హైడ్రాకు మా కృతజ్ఞతలు అని వారు తెలిపారు. చిన్నారులందరూ కమిషనర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పగా, ఆయన వారికి స్వీట్స్ పంచిపెట్టి ఆనందాన్ని పంచుకున్నారు.