|
|
by Suryaa Desk | Sat, Jan 17, 2026, 05:54 PM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ ఇకపై ప్రకటనల బాట పట్టబోతోంది. ఎపెన్ ఏఐ విలువ 500 బిలియన్ డాలర్లకు పెరిగినప్పటికీ భారీగా పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను ఎదుర్కొనేందుకు వచ్చే కొన్ని వారాల్లో చాట్‌జీపీటీలో అడ్వర్టైజ్‌మెంట్లను పరీక్షించనున్నట్లు ఓపెన్‌ఏఐ ప్రకటించింది. మొదట అమెరికాలో ఫ్రీ, తక్కువ స్థాయి సబ్‌స్క్రిప్షన్ వినియోగదారులకు మాత్రమే ఈ ప్రకటనలు కనిపించనున్నాయి. అయితే ప్రో, ఎంటర్‌ప్రైజ్ యూజర్లకు మాత్రం యథావిధిగా యాడ్స్ ఉండవని సంస్థ స్పష్టం చేసింది.దాదాపు బిలియన్ మంది వినియోగదారులు ఉన్నప్పటికీ, చాలా తక్కువ మంది మాత్రమే చెల్లింపు సేవలు వినియోగిస్తుండటంతో కొత్త ఆదాయ మార్గాల అవసరం ఏర్పడింది. శక్తిమంతమైన కంప్యూటింగ్ వ్యవస్థల కోసం భారీగా ఖర్చవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రకటనలు చాట్‌జీపీటీ సమాధానాలను ప్రభావితం చేయవని, యూజర్ల వ్యక్తిగత డేటా ప్రకటనదారులకు అందుబాటులో ఉండదని ఓపెన్‌ఏఐ హామీ ఇచ్చింది. యూజర్ నమ్మకం, అనుభవమే తమకు మొదటి ప్రాధాన్యమని సంస్థ మరోసారి స్పష్టం చేసింది.