|
|
by Suryaa Desk | Sat, Jan 17, 2026, 01:10 PM
ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా ఇంకా మోగకముందే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ముందే క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని పట్టుకునేందుకు పలు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులను ఈ సంస్థలు సంప్రదిస్తూ, నియోజకవర్గాల్లో వారి బలాబలాలపై నివేదికలు ఇస్తామని నమ్మబలుకుతున్నాయి. ఓటర్ల మనోగతం మాకు తెలుసంటూ అభ్యర్థులకు ఆశ చూపుతూ జిల్లాలో సందడి చేస్తున్నాయి.
టికెట్ల వేటలో ఉన్న ఆశావాహులు ఈ సర్వే రిపోర్టులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం వద్ద తమ గెలుపు గుర్రాలని నిరూపించుకోవడానికి ఈ సంస్థలు ఇచ్చే గణాంకాలను ఆయుధాలుగా వాడుకోవాలని చూస్తున్నారు. దీంతో సదరు సర్వే సంస్థలు అడిగినంత ఇచ్చుకోవడానికి కూడా అభ్యర్థులు వెనుకాడటం లేదు. సోషల్ మీడియాలో కూడా తమకు అనుకూలమైన సర్వే ఫలితాలను ప్రచారం చేసుకుంటూ ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
మరోవైపు, ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తును ముమ్మరం చేసింది. వార్డుల పునర్విభజన ప్రక్రియతో పాటు రిజర్వేషన్ల ఖరారుపై అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. మారుతున్న వార్డుల సరిహద్దులు, రిజర్వేషన్ల మార్పులు ఆశావాహుల లెక్కలను తలకిందులు చేస్తున్నాయి. ఏ వార్డు ఎవరికి కేటాయిస్తారో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొనడంతో, అభ్యర్థులు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతూనే వ్యూహాలకు పదును పెడుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల వేళ జిల్లాలో రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పాత ముఖాలతో పాటు కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వారు కూడా ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వార్డుల వారిగా ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. అటు ప్రభుత్వ కసరత్తు, ఇటు ప్రైవేట్ సంస్థల సర్వేలతో ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి అప్పుడే పతాక స్థాయికి చేరుకుంది.