|
|
by Suryaa Desk | Sat, Jan 17, 2026, 06:41 PM
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ముసుగులో సాగుతున్న 'లక్కీ డ్రా' దందాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వేదికగా భారీ బిల్డప్‌లు ఇస్తూ.. అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. గతంలో సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వాటిపై ఆంక్షలు కఠినతరం చేయడంతో.. ఇప్పుడు వీరు 'లక్కీ డ్రా'ల పేరుతో కొత్త వేషాలు వేశారని సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ ధరకే కార్లు, బైకులు, ఖరీదైన ప్లాట్లు, డీజే సిస్టమ్స్ ఇస్తామంటూ నమ్మబలికి ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. వేల సంఖ్యలో కూపన్లు అమ్మి, చివరకు తమకు కావాల్సిన వారికే బహుమతులు ఇస్తూ లేదా అసలు ఇవ్వకుండానే చేతులెత్తేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు.
ఇలాంటి ప్రైజ్ చిట్స్, లక్కీ డ్రాలు నిర్వహించడం భారత రాజ్యాంగం ప్రకారం నేరమని ట్వీట్ చేశారు. 'రీల్స్‌లో బిల్డప్.. రియాలిటీలో ఫ్రాడ్! లక్కీ డ్రా ఇన్‌ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్త! సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు, ప్లాట్లు, డీజేలు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో వీళ్లు దర్శనమిస్తున్నారు. అమాయకపు ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని నిండా ముంచుతున్న ఇన్ఫ్లూయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.The Prize Chits and Money Circulation Schemes (Banning) Act-1978 ప్రకారం కేసులు నమోదు చేస్తాం. మోసాలకు పాల్పడే వారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లైనా సరే.. ఎవరినీ ఉపేక్షించేది లేదు. పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవు. అని సజ్జనార్ హెచ్చరించారు.
సామాన్య ప్రజల ఆశను పెట్టుబడిగా మార్చుకుంటున్న ఈ 'డిజిటల్ దోపిడీ' పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అతి తక్కువ ధరకే లగ్జరీ వస్తువులు వస్తాయనే భ్రమలో పడి కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని కోరుతున్నారు. సోషల్ మీడియాలో చూసేవన్నీ నిజం కావని, ముఖ్యంగా నగదు చెల్లింపులు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు.