|
|
by Suryaa Desk | Sat, Jan 17, 2026, 06:34 PM
హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ, నాళాల విస్తరణ పనులను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్నమైన విధానాన్ని ప్రవేశపెట్టింది. నగర అభివృద్ధిలో భూసేకరణ అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. ముఖ్యంగా నీటి వనరుల సమీపంలో ఉన్న పట్టా భూములను సేకరించేటప్పుడు యజమానులకు నష్టం కలగకుండా ఉండేందుకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ‘ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్’ (టీడీఆర్) విధానాన్ని మరింత బలోపేతం చేసింది.
భారీ స్థాయిలో ప్రోత్సాహకాలు..
నగరంలోని జలవనరుల పునరుద్ధరణ కోసం తమ భూములను ప్రభుత్వానికి అప్పగించే వారికి ప్రభుత్వం ఆకర్షణీయమైన పరిహారాన్ని ప్రకటిస్తోంది. భూమి ఉన్న ప్రాంతాన్ని బట్టి ఈ టిడిఆర్ శాతం మారుతుంది. చెరువుల ఎఫ్.టి.ఎల్ పరిధిలో.. భూమి కోల్పోయిన వారికి 200 శాతం టిడిఆర్ ఇస్తారు. బఫర్ జోన్ పరిధి.. చెరువుల రక్షణ గట్టు ప్రాంతంలో భూమి ఇచ్చేవారికి 300 శాతం టిడిఆర్ అందుతుంది. నాళాల విస్తరణ విషయానికి వస్తే.. వరద నీటి కాలువల వెడల్పు పెంపు కోసం భూమి ఇచ్చేవారికి ఏకంగా 400 శాతం టిడిఆర్ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీనివల్ల ప్రభుత్వానికి నగదు రూపంలో చెల్లించాల్సిన భారం తగ్గడమే కాకుండా.. భూమి కోల్పోయిన యజమానులకు భవిష్యత్తులో ఇతర ప్రాంతాల్లో అదనపు అంతస్తుల నిర్మాణం చేపట్టేందుకు లేదా ఆ హక్కులను ఇతరులకు అమ్ముకునేందుకు గొప్ప అవకాశం లభిస్తుంది.
హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ వంటి సంస్థలు చేపట్టే పనుల కోసం భూమిని సేకరించినప్పుడు, సరైన రెవెన్యూ పత్రాలు ఉన్న వారికి వెంటనే సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఒకవేళ సదరు భూమిపై కోర్టు వివాదాలు ఉంటే.. ఆ సర్టిఫికెట్లను ‘టీడీఆర్ బ్యాంక్’లో భద్రపరుస్తారు. వివాదం పరిష్కారం అయిన తర్వాత అసలైన యజమానికి వాటిని అందజేస్తారు.
రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త నిబంధనలు..
ఈ టీడీఆర్ సర్టిఫికెట్లకు మార్కెట్‌లో మంచి ధర లభించేలా ప్రభుత్వం బిల్డింగ్ నియమాల్లో మార్పులు చేసింది. నగరంలో పది అంతస్తుల కంటే ఎక్కువ ఎత్తు ఉండే భవనాలను నిర్మించే డెవలపర్లు, తమ మొత్తం నిర్మాణ విస్తీర్ణంలో 10 శాతాన్ని తప్పనిసరిగా టీడీఆర్ ద్వారానే పొందాల్సి ఉంటుంది. దీనివల్ల భూమి కోల్పోయిన వారి వద్ద ఉన్న సర్టిఫికెట్లకు గిరాకీ పెరిగి.. వారికి త్వరితగతిన నగదు అందుతుంది. ఈ విధానం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా క్రమబద్ధంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.