|
|
by Suryaa Desk | Sun, Jan 18, 2026, 07:15 PM
సింగరేణి బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో తన పేరును బయటకు తీయటంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఒక ప్రముఖ మీడియా సంస్థ కథనంపై అత్యంత ఘాటుగా స్పందించారు. సింగరేణి బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో తన పేరును ప్రస్తావిస్తూ సదరు పత్రికా యజమాని రాసిన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ఆస్తులు సంపాదించడానికో, పదవుల కోసమో కాదని, ప్రజల ఆస్తులను కాపాడటమే తన పరమావధి అని ఆయన స్పష్టం చేశారు.
ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సమాజంలోని వనరులను ప్రజలందరికీ సమానంగా పంచాలనే ఆశయంతోనే తాను ప్రజా జీవితంలోకి వచ్చానని తెలిపారు. సింగరేణి అనేది కేవలం ఒక సంస్థ కాదని, అది తెలంగాణ ప్రజల ఆస్తి, రాష్ట్ర ప్రజల ఆత్మ అని ఆయన అభివర్ణించారు. ప్రజలను పీక్కుతింటున్న గద్దల నుంచి ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికే తాను ఈ బాధ్యతలో ఉన్నానని చెప్పారు. తాను ఇక్కడ ఉన్నంత కాలం ఏ ఒక్క గద్దను కూడా సింగరేణి దరిదాపుల్లోకి రానివ్వనని ఆయన హెచ్చరించారు.
సదరు మీడియా సంస్థ రాసిన టెండర్ల ఆరోపణలపై భట్టి విక్రమార్క సాంకేతిక వివరణ ఇచ్చారు. టెండర్లను పిలిచేది సింగరేణి సంస్థ, దాని బోర్డు అని, నిబంధనలను కూడా సంస్థే ఖరారు చేస్తుందని ఇందులో మంత్రి ప్రమేయం ఉండదని ఆయన స్పష్టం చేశారు. గనులు క్లిష్టతరమైన ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఫీల్డ్ విజిట్ (క్షేత్రస్థాయి పరిశీలన) నిబంధన విధించడం సర్వసాధారణమని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇవే నిబంధనలను అనుసరిస్తాయని ఆయన గుర్తు చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా కథనాలు రాయడం తగదని హితవు పలికారు.
గత జ్ఞాపకాలను ప్రస్తావిస్తూ.. తాను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిని కావడంతో ఆయన మీద ఉన్న కోపంతోనే ఇప్పుడు తనపై ఇటువంటి అసత్య కథనాలు రాస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుపెట్టుకుని ప్రజా ప్రతినిధుల వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చవద్దని ఆయన కోరారు. వ్యక్తుల వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లడం లేదా ఎవరి గురించి అయినా నీచమైన పనులు చేయించడం వంటి వీక్ క్యారెక్టర్ తనది కాదని అని ఆయన స్పష్టం చేశారు. మీడియా సంస్థల మధ్య ఉన్న అంతర్గత పోటీలోకి తనను లాగొద్దని, నిజానిజాలను ప్రజలే తేలుస్తారని భట్టి విక్రమార్క వెల్లడించారు.