|
|
by Suryaa Desk | Mon, Jan 19, 2026, 09:10 PM
తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. అర్హులైన పేదలకు కాకుండా.. ఆర్థికంగా స్థితిమంతులైన వారికి ఇళ్లు దక్కాయన్న ఫిర్యాదులపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధికారులు నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
సర్వే అధికారులు వస్తున్నారన్న సమాచారంతో.. ఇళ్లలో నివసించని లబ్ధిదారులు సైతం తనిఖీ సమయంలో హాజరవుతున్నారు. ఈ సవాలును అధిగమించేందుకు అధికారులు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అదే ‘కరెంట్ బిల్లుల తనిఖీ’. విద్యుత్ శాఖ నుంచి గత నాలుగు నెలల బిల్లులను సేకరించి పరిశీలిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా రాంపల్లిలోని 2,200 ఇళ్లను తనిఖీ చేయగా.. మెజారిటీ ఇళ్లలో నెలకు 50 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం జరిగినట్లు తేలింది. సాధారణంగా ఒక కుటుంబం నివసిస్తే కనీసం 150 నుంచి 200 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంతకంటే తక్కువ రీడింగ్ ఉండటంతో.. ఆ ఇళ్లలో లబ్ధిదారులు ఉండటం లేదని అధికారులు నిర్ధారించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. నాలుగు చక్రాల వాహనం (కారు లేదా ట్రాక్టర్) ఉన్న వారు ఏ రకమైన గృహ నిర్మాణ పథకానికైనా అనర్హులు. కానీ.. మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించిన తనిఖీల్లో 165 మంది లబ్ధిదారులకు సొంతంగా కార్లు, ట్రాక్టర్లు ఉన్నట్లు గుర్తించారు. వీరి వివరాలను అధికారులు సేకరించడంతో.. లబ్ధిదారులు హౌసింగ్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పాత ప్రభుత్వం హయాంలో తమ కంటే సంపన్నమైన వారికి కూడా ఇళ్లు ఇచ్చారని... కేవలం తమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించడం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 59,400 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించాల్సి ఉంది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 22,000 ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. గ్రేటర్ తరహాలోనే త్వరలో జిల్లాల్లో కూడా ప్రత్యేక యాప్ ద్వారా సర్వే నిర్వహించేందుకు హౌసింగ్ శాఖ సిద్ధమైంది. అక్రమంగా ఇళ్లు పొందిన వారి నుంచి వాటిని స్వాధీనం చేసుకొని.. ‘ప్రజా పాలన’ దరఖాస్తుల్లో ఇళ్లు లేని నిజమైన పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీని కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.