|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 10:44 AM
సెప్టిక్ ట్యాంకులను కూడా కబ్జాదారులు వదలడం లేదు. సెప్టిక్ ట్యాంకు చుట్టూ మొక్కలను పెంచి ఆ దుర్వాసనను దూరం చేద్దామని ఉద్దేశించిన ఖాళీ స్థలాలను కూడా ఆక్రమించేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆయా స్థలాలను పార్కులకోసం వినియోగించడం పరిపాటి. ఆ లే ఔట్ వేసిన వారికి కాని, అప్పట్లో లే ఔట్ కోసం భూమిని అమ్మిన వారికి ఆ స్థలాల మీద ఎలాంటి హక్కు లేకున్నా.. వాటిని తర్వాత తమ సొంత స్థలాలుగా ఆక్రమించుకుని ప్లాట్లుగా మార్చుతున్న ఉదంతాలు నగరంలో పలు చోట్ల పరిపాటిగా మారింది. కూకట్‌పల్లి జోన్ ఆల్విన్ కాలనీ సర్కిల్ చేరువలోని శిల్పా బృందావన్ కాలనీలోనూ అదే జరిగింది. ఈ లే ఔట్‌లోని సెప్టిక్ ట్యాంక్ తోపాటు ఆ పక్కనే ఉన్న ఖాలీ స్థలాన్ని వైవీ రావు అనే వ్యక్తి కబ్జా చేసేస్తున్నారని అక్కడి నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అంతే కాదు.. తమ లే ఔట్‌కు ఆనుకుని రైతుకు చెందిన భూమిగా కొంత చూపుతూ.. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో అనుమతి లేని లే ఔట్‌తో ప్లాట్లు వేయడం, రహదారులు నిర్మించేందుకు హద్దులు నిర్ధారించడం.. తమ లే ఔట్ హద్దులను కూడా చెరిపేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారులతో హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. సెప్టిక్ ట్యాంకు ప్రాంతంలో 20 గుంటల మేర ఆక్రమణలు జరిగినట్టు నిర్ధారించుకుంది. అలాగే అనుమతి లేని లే ఔట్ చుట్టూ గురువారం ఫెన్సింగ్ వేసింది. ఈ లే ఔట్‌లో ప్లాట్లు కొని సామాన్యులు మోస పోకుండా.. సెప్టిక్ ట్యాంక్, ఓపెన్ ప్లేస్‌తో పాటు.. ప్రభుత్వ భూమిగా పేర్కొంటున్న దాదాపు 4 ఎకరాలను కాపాడింది. ఫిర్యాదు చేసిన వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలించి .. ప్రభుత్వ భూమితో పాటు.. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను హైడ్రా కాపాడడం పట్ల శిల్పా బృందావన్ కాలనీ నివాసితులు హర్షం వ్యక్తం చేశారు.