ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి రేవంత్ రెడ్డి.. ‘ఆపరేషన్ జె’ మొదలు..?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 07, 2024, 09:22 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఏపీ పర్యటనకు రానున్నారు. మంగళగిరిలో నిర్వహించనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జయంతి వేడుకల కోసం ఆయన కుమార్తె, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి ఏపీకి వెళ్తున్నారు. సీఎంతోపాటు తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన పలువురు మంత్రులు, సీనియర్ నేతలు సైతం ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.జులై 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు పాల్గొననున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులను ఈ వేడుకలకు షర్మిల స్వయంగా ఆహ్వానించారు.


సోనియా సందేశం..


వైఎస్ జయంతి వేళ.. ఏపీకి, కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ సోనియా గాంధీ ఓ సందేశం పంపారు. షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందనే విశ్వాసాన్ని సోనియా వ్యక్తం చేశారు.


ఏపీకి రెండోసారి రేవంత్..


ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే.. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఏపీలో పర్యటించనుండటం ఇది రెండోసారి. ఎన్నికల ముంగిట విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. షర్మిల కోసం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం తాను ఇక ముందు కూడా ఆంధ్రాకు వస్తానని రేవంత్ తెలిపారు. ఇప్పుడు ఆయన మరోసారి తెలంగాణ సీఎం హోదాలో ఏపీకి వెళ్తున్నారు.


ఏపీలో పార్టీని బలోపేతం చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇందుకోసం ప్రతి అవకాశాన్ని వాడుకునే ఉద్దేశంతో ఆ పార్టీ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే షర్మిలకు పీసీసీ చీఫ్‌గా పగ్గాలు అప్పగించింది. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న తొలి వైఎస్ జయంతి వేడుకలు కావడంతో.. ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.


వైఎస్ వారసత్వంపై కాంగ్రెస్ కన్ను..


ఏపీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. కాంగ్రెస్ స్థానాన్ని జగన్ నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ఆక్రమించింది. ఇప్పుడు ఏపీలో తిరిగి పాగా వేయాలనే లక్ష్యంతో ఉన్న హస్తం పార్టీ.. జగన్ సోదరి షర్మిలను తమవైపు తిప్పుకోగలిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న జగన్‌కు.. ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో, తన సోదరి రూపంలోనే ముప్పు పొంచి ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని.. ఆయన వారసురాలిగా తాను కాంగ్రెస్‌ పార్టీ కోసం పని చేస్తున్నానని షర్మిల ప్రచారం చేసుకుంటున్నారు.


టార్గెట్ 2029..


2029 ఎన్నికల నాటికి ఏపీలో బలోపేతం కావాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్.. తిరిగి తన పాత ఓటు బ్యాంకును దక్కించుకోవాలనే ప్రయత్నాల్లో ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే.. కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలం పుంజుకోవడం కోసం ‘ఆపరేషన్ జె’ మొదలుపెట్టినట్టే. దీనికి రేవంత్ రెడ్డి సహా ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలు తమ వంతు సహకారం అందించాల్సి ఉంటుంది. హస్తం పార్టీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో.. జగన్ పార్టీ వాటిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa