గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ ను గుడ్డిగా నమ్మకూడదని మరోసారి రుజువయ్యింది. ఉత్తరప్రదేశ్‌లో గూగుల్ మ్యాప్స్ చెప్పిన దారిలో వెళ్లి ఒక కారు కాలువలోకి దూసుకువెళ్లింది. డిసెంబరు 3న ముగ్గురు వ్యక్తులతో వెళ్తున్న టాటా టిగోర్ రోడ్డు మలుపులో ఉన్న కాలువలో పడిపోయింది. ఆ కారు డ్రైవర్ తన గమ్య స్థానానికి వెళ్లే మార్గం కోసం గూగుల్ మ్యాప్స్‌పై ఆధారపడ్డట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ, ఆ కారులోని ముగ్గురు వ్యక్తులను స్థానికులు ప్రాణాలతో రక్షించారు.
గూగుల్ మ్యాప్స్ చూపిన దారిలో వెళ్తూ, అసంపూర్తిగా నిర్మాణమై ఉన్న బ్రిడ్జిపై నుంచి ఒక కారు పడిన ఘటన జరిగి 10 రోజులు కూడా గడవకముందే, గూగుల్ మ్యాప్స్ వల్ల మరో తీవ్రమైన ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. నవంబర్ 24న అసంపూర్తిగా ఉన్న వంతెనపై నుంచి ఒక కారు పడిపోయిన విషయం తెలిసిందే. తాజా ఘటన వివరాల్లోకి వెళితే, ముగ్గురు వ్యక్తులు తెల్లటి టాటా టిగోర్ సెడాన్‌లో ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ వైపు వెళ్తున్నారు. నావిగేషన్ యాప్ గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించి ఈ ముగ్గురూ బరేలీలోని బడా బైపాస్‌కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. యాప్ వారికి రెండు రూట్ ఆప్షన్‌లను అందించింది. అందులో ఒకటి బరేలీ-పిలిభిత్ రాష్ట్ర రహదారి గుండా కాగా, మరొకటి షార్ట్ కట్ ద్వారా సమీపంలోని గ్రామం ద్వారా. అయితే, కార్లోని ముగ్గురూ షార్ట్ కట్ మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఐదు కిలోమీటర్లు ముందుకు వెళ్లగా బర్కాపూర్ గ్రామ క్రాసింగ్ సమీపంలో రోడ్డు కోతకు గురికావడంతో కారు అదుపుతప్పి కాలాపూర్ కాలువలో పడింది.