రాష్ట్ర కేబినెట్‌లో గురువారం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహించడానికి ముందుకువచ్చిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)కు రుషికొండ ఐటీ పార్కులోని మూడో నంబరు కొండపై గల మిలీనియం టవర్-ఏ, టవర్-బీలలో మొత్తం 2.08 లక్షల చదరపు అడుగుల స్థలం కేటాయించాలని నిర్ణయించారు. టవర్-ఏలో ఎనిమిది అంతస్థులు ఉండగా అందులో మొదటి నాలుగు అంతస్థుల్లో కాండ్యుయెంట్ కంపెనీ నడుస్తోంది. పైన నాలుగు అంతస్థులు టీసీఎస్‌కు ఇస్తారు. అలాగే ఆ పక్కనే నిర్మించిన టవర్-బిలో గ్రౌండ్ ఫ్లోర్‌తో కలుపుకొని ఎనిమిది అంతస్థులు ఉన్నాయి. రెండో అంతస్థు మినహాయించి భవనం మొత్తం టీసీఎస్‌కు కేటాయించారు. ఇందులో 98,373 చ.అ. స్థలం ఉండగా మిగిలిన స్థలం అంతా టవర్-ఏలో ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఐకానిక్ టవర్లు ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పరిధిలో ఉన్నాయి. వీటిని డీనోటిఫై చేశాక టీసీఎస్‌కు అప్పగించనున్నారు. దీనికి ముందు నాన్ సెజ్ ఏరియాలో డల్లాస్ టెక్నాలజీస్ నిర్మించిన భవనాన్ని తీసుకోవడానికి టీసీఎస్ ముందుకువచ్చింది. లీజు ఒప్పందం కూడా జరిగింది. అయితే టీసీఎస్ కోరిక మేరకు మిలీనియం టవర్లను కేటాయించారు. వీటిలో షిఫ్ట్‌నకు రెండు వేల మంది పనిచేసుకునే వెసులుబాటు ఉంది. ఆ సంస్థ మొత్తం దశల వారీగా పది వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది.