కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద గత ప్రభుత్వం పెద్ద మొత్తం బకాయిలు పెట్టి వెళ్లిందని, ముందు ఎంతోకొంత ఇస్తే వారికి కొంత ఉపశమనం కలుగుతుందని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు బకాయిల్లో కొంత ఈ నెలలో విడుదల చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్రం వారి ఖాతాల్లో ఫీజుల డబ్బులు వేస్తున్నందువల్ల రాష్ట్రం ఇచ్చే డబ్బులు కూడా, వారి వరకూ ఆ విద్యార్థుల ఖాతాల్లోనే వేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ వర్గాల విద్యార్థులకు ఫీజుల మొత్తంలో అరవై శాతం కేంద్రం ఇస్తోంది. కాలేజీలకు బకాయిలు కొంత మేర విడుదల చేస్తున్నందువల్ల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్లు, సంబంధిత శాఖ అధికారులు బాధ్యత తీసుకొనేలా చూడాలని సమావేశం నిర్ణయించింది. ఆడబిడ్డల నిధి పథకం కూడా వరుస క్రమంలో అమలు చేద్దామని, నిధుల లభ్యత చూసుకొని వెళ్దామని ముఖ్యమంత్రి చెప్పారు.