విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో "డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం" పథకాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ముందుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన మంత్రి లోకేశ్.. తరగతి గదులు, కెమిస్ట్రీ ల్యాబ్ పరిశీలించారు. అనంతరం క్లాస్ రూముల్లో విద్యార్థినిలతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్రవ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజనం అందించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ కళాశాలల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.