‘గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లను కొనసాగించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి’ అంటూ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ వలంటీర్స్ అసోసియేషన్(ఏఐవైఎఫ్) నేతలు కోరారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ లెనిన్ సెంటర్‌లో వలంటీర్లు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడారు. వలంటీర్లకు న్యాయం చేయాలని, ఉద్యోగాల నుంచి తొలగించొద్దని, ఎన్నికల వాగ్దానం అమలు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం వలంటీర్లకు పెండింగ్ జీతాలు చెల్లించాలని, నెలకు రూ.10 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటపై నిలబడకుండా యూటర్న్ తీసుకోవడం బాధాకరమని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు అన్నారు. వలంటీర్లకు న్యాయం జరిగే వరకు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. వలంటీర్లతో పాటు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు జి.వర్లరాజు, బి.నానాజీ తదితరులు పాల్గొన్నారు.