తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఎంతో ప్రతీతి. తమ కోరికలు త్వరగా తీరుస్తాడని ఎంతోమంది భక్తులు నమ్ముతుంటారు. అలాగే దేవుడుపై ఉన్న భక్తితో తమకు తోచిన సహాయాన్ని కూడా శ్రీవారి ఆలయానికి భక్తులు సమర్పిస్తుంటారు. ధన, వస్తువు రూపంలో కానుకలు ఇస్తుంటారు. ఇలాగే బెంగళూరుకు చెందిన ఓ దాత సాయం అందజేశారు. ఇలా ఎంతోమంది దాతలు తిరుమల ఆలయానికి వచ్చి సహాయం చేస్తుంటారు. విదేశాల నుంచి కూడా ఎంతో ఖర్చు, వ్యయంతో ఆలయానికి పుష్పాలను తీసుకువస్తుంటారు దాతలు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేసిన పనికి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బెంగళూరుకు చెందిన దాత సునీతాగౌడ. అధికారుల తీరుతో తిరుమల ఆలయ ప్రతిష్టత మసకబారుతోందని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.దాతల సహాయంతో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణను టీటీడీ చేయించింది. మొదటి రోజు, నాల్గోవ రోజు, ఏడో రోజు ఆలయంలో దాతల సహకారంతో ప్రత్యేక పుష్పాలంకరణను టీటీడీ చేయించింది. నిన్న ఏడోవరోజు సందర్భంగా బెంగళూరుకు చెందిన దాత సునీతాగౌడ్ సహకారంతో పుష్పాలంకరణను టీటీడీ చేయించింది. కోటి రూపాయల వ్యయంతో విదేశాల నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన పుష్పాలు, విగ్రహాలతో దాత సునీతాగౌడ అలంకరణ చేయించారు. ఇవాళ ఉదయం దాతలకు సమాచారం కూడా ఇవ్వకుండా విగ్రహాలను టీటీడీ సిబ్బంది ట్రాక్టర్‌లో వేసేశారు. తమ మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తారా అంటూ టీటీడీ అధికారులను దాత నిలదీశారు. టీటీడీ వైఖరీపై ఆలయం ముందే దాత కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఈ విషయంపై టీటీడీ అధికారులు స్పందించాల్సి ఉంది.