ఆలయ హుండీ లెక్కింపులో చలామణీలో లేని రూ.2వేల నోట్లు ప్రత్యక్షం కావటం ఆశ్చర్యం కలిగించింది. ఒకటి, రెండు కాకుండా ఏకంగా రూ. 2.44 లక్షల విలువైన నోట్లు హుండీలో ఉండటంతో ఆలయ సిబ్బంది అవాక్కయ్యారు. గుంటూరు జిల్లా తెనాలి వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీపద్మావతీ సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ 3 నెలల్లో భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు, నగదును ట్రస్ట్‌బోర్డ్ సభ్యులు, భక్తుల సమక్షంలో అధికారులు గురువారం లెక్కించారు. ఈ క్రమంలో రూ. 2వేల నోట్లు కనిపించాయి. దీంతో అధికారులు, లెక్కింపు సిబ్బంది విస్తుపోయారు. 2023లోనే చలామణీకి దూరమై, ఈ మధ్యకాలంలో బయట కనిపించని నోట్లు హుండీలో దర్శనమివ్వటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాటిని జాగ్రత్త చేసినట్టు ఆలయ ఈఓ అనుపమ చెప్పారు.