ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు రాజధానిలోని వెలగపూడిలో 25 వేల చదరపు గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన ఇంటిస్థలాన్ని చూసేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వచ్చారు. అక్కడ ఉన్న వారితో పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఆ స్థలంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు భూ సార పరీక్షలు చేయించారు. ఆ స్థలంలో గృహం, భద్రత సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్, లాన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యుల నుంచి సీఎం చంద్రబాబు కుటుంబం ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు. చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలానికి నాలుగు వైపులా రోడ్లు, రాజధాని లోని E 6 రోడ్డుకు ఆనుకుని ఈ స్థలం ఉంది. కీలకమైన భవనాలు గెజిటెడ్ అధికారులు, NGO నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్ట్, విట్, గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు దగ్గరలో రెండు కిలోమీటర్లు దూరంలో ఈ స్థలం ఉంది. సీఎం చంద్రబాబు ఇంటి కోసం మొత్తం 5 ఎకరాలు కొనుగోలు చేశారు.కాగా.. సీఎం చంద్రబాబు ప్రస్తుతం కృష్ణా నది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన గెస్ట్‌హౌస్‌లోనే ఉంటున్నారు. గత పదేళ్లుగా చంద్రబాబు ఈ నివాసంలోనే ఉంటున్నారు. అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చాక సొంతిల్లు నిర్మించుకుంటానని గతంలో చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా భూమిని కొనుగోలు చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా సొంత ఇంటిని నిర్మిస్తున్నారు. ఆ ఇంటి పనులను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఇప్పుడు అమరావతిలో కూడా చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేశారు. సీఎం చంద్రబాబు అధిక సమయం అమరావతిలోనే ఉంటున్నారు. చంద్రబాబుకు అమరావతిలో శాశ్వత నివాసం లేదని వైఎస్సార్‌సీపీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అందుకే రాజధానిలో సొంతంగా ఇంటి నిర్మాణం చేసే పనిలో సీఎం చంద్రబాబు ఉన్నారు.