మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ వ్యక్తి.. గురువారం రోజు స్థానికంగా ఉన్న ఓ గుడికి వెళ్లాడు. దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకుని గుడి బయటకు వచ్చాడు. అక్కడే ఓ యాచకుడు కనిపించగా.. తన జేబులో ఉన్న చిల్లర తీసి ఇచ్చాడు. ఆ విషయాన్ని గుర్తించిన పోలీసులు అతడిపై కేసు పెట్టారు. కేవలం బిచ్చగాడికి డబ్బులు ఇచ్చినందుకే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యంగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223 కింద ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. ఆ వ్యక్తి తెగ ఆందోళన పడిపోతున్నాడు.
కానీ పోలీసులు మాత్రం భిక్షమేసిందుకు ఇతడికి ఏడాది పాటు జైలు శిక్ష లేదా రూ.2,500 రూపాయల జరిమానా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. లేదంటే ఈ రెండు శిక్షలు అమలు కావచ్చని వివరిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ను యాచకులు లేని నగరంగా చేసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది నవంబర్ నెల నుంచే నగరవ్యాప్తంగా ఉన్న యాచకులను ఉజ్జయినిలోని సేవాధామ్ ఆశ్రమానికి తరలించారు.
అలాగే భిక్షమెత్తుకునే వారిపైనే కాకుండా.. దానం చేసే వారిపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది. ముఖ్యంగా 2025 జనవరి 1వ తేదీ నుంచి యాచకులకు దానం చేసే వారిపై కేసులు నమోదు చేయాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలలోనే ఈ విషయాలను వెల్లడించగా.. ఈ ఏడాది మొదటి నుంచి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించినప్పటికీ.. తాజాగా వ్యక్తి యాచకుడికి డబ్బు దానం చేశాడు. దీంతోనే అతడిపై కేసు పెట్టారు. మరి ఇప్పటికైనా అక్కడి ప్రజలు యాచకులకు భిక్షం వేయడం ఆపేస్తారా లేక వారికి సాయం చేస్తాం, పుణ్యం వస్తుందంటూ డబ్బులు ఇచ్చి ఇలాగే ఊచలు లెక్కబెడతారో చూడాలి.