గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం.. హమాస్ శనివారం రోజు నలుగురు మహిళా సైనికులను విడుదల చేసింది. ప్రస్తుతం విడుదల అయిన నలుగురు మహిళా సైనికులను హమాస్.. 2023 అక్టోబర్ 7వ తేదీన గాజా సరిహద్దుకు సమీపంలోని వహల్ ఓజ్ మిలిటరీ బేస్ నుంచి బంధించి తీసుకెళ్లింది. అయితే అప్పుడు కేవలం 19 ఏళ్ల వయసు కల్గిన నామా లెవి కూడా అందులో ఉన్నారు. హమాస్ నామా లెవిని తీవ్రంగా కొట్టగా.. ముఖమంత్రి రక్తమయం అయింది. ఒళ్లంతా గాయాలు కాగా.. చేతులు కట్టిపడేసి జీపులో వేసుకుని వెళ్లిపోయారు. అప్పట్లో ఈ వీడియో నెట్టింట సంచలం రేపింది.
అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు హమాస్ వద్దే వీరంతా బందీలుగా ఉన్నారు. సరిగ్గా 477 రోజుల పాటు వీరికి హమాస్ నిత్యం నరకం చూపించింది. అయితే తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగా.. మొదటి రోజే గాజా నుంచి ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా 100 మంది పాలస్తీనా పౌరులకు విముక్తి కల్పించింది. తాజాగా ఇప్పుడు హమాస్ రెండోసారి నలుగురు మహిళా సైనికులను విడుదల చేసింది.
ఈ నలుగురు అధికారులకు మిలిటరీ యూనిఫామ్ వేసి మరీ తీసుకువచ్చి రెడ్ క్రాస్‌కు అప్పగించింది. అయితే వీరిలో కరీనా అరీవ్, డానియెల్ గిల్‌బోవా, లిరి అల్బాజ్‌లతో పాటు నామా లెవి కూడా ఉంది. వీరంతా చాలా సంతోషంగా నవ్వుతూ ఫొటోలు, వీడియోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. అంతా సంబుర పడిపోతున్నారు. ముఖ్యంగా హమాస్ బంధీలుగా తీసుకు వెళ్తున్న రోజు రక్తంతో తడిసిపోయిన నామా లెవి.. ఇప్పుడు నవ్వుతూ కనిపించేసరికి ఆమె.. ఈమెనే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. 42 రోజుల తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందలో తమ చెరలో ఉన్న 94 మంది బందీల్లో 33 మందికి హమాస్ విముక్తి కల్పించబోతుంది. అలాగే అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ 1700 మందికి పైగా పాలస్తీనియన్లను విడిచి పెట్టబోతుంది.