కన్న కూతురు ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే, వెళ్లొద్దంటూ ప్రాధేయపడుతున్న తండ్రి.. అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). పరుగు సినిమా తరహా ఈ దృశ్యం తమిళనాడులో జరిగిందని చెబుతున్నారు. ఈ వీడియోలో ఒక యువతి, ఒక యువకుడితో వెళ్లిపోతుంటే.. ఒక వ్యక్తి వారిని అడ్డుకుంటూ, ప్రాధేయపడుతున్నట్లుగా ఉంది. కుమార్తె కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించినట్లుగా ఉంది. తమిళంలో సంభాషణలు ఉన్న ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘హార్ట్ బ్రేకింగ్’ అని క్యాప్షన్ ఇస్తున్నారు. సజగ్ బృందం ఈ వీడియోకు సంబంధించిన నిజానిజాలను తెలుసుకునేందుకు ప్రయత్నించగా.. ఆశ్చర్యకరమైన వివరాలు తెలిశాయి..
క్లెయిమ్ ఏంటి?
పరుగు సినిమాలో దృశ్యం.. తమిళనాడులో ప్రత్యక్షం - ఎక్స్ (ట్విట్టర్)లో @JKanagani84451 అనే పేరుగల ఖాతా నుంచి ఒక వీడియోను షేర్ చేస్తూ ఈ క్యాప్షన్ ఇచ్చారు. ‘కన్న కూతురు ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే వెళ్లొద్దని ప్రాధేయ పడుతున్న తండ్రి’ అని పేర్కొన్నారు.
ట్విట్టర్‌లో @FilmyBowl, @UttarandhraNow, @PPR_CHALLA అనే పేరుతో ఉన్న ఖాతాల నుంచి కూడా ఈ వీడియోను షేర్ చేసి, ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఫేస్‌బుక్‌లోనూ పలువురు యూజర్లు ఈ వీడియోను షేర్ చేశారు.
అసలు వాస్తవం ఏంటి?
వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించిన నిజానిజాలను తెలుసుకునేందుకు మేం (సజగ్ బృందం) ఈ వీడియో నుంచి కొన్ని కీఫ్రేమ్స్‌ను తీసుకొని గూగుల్ లెన్స్ సాయంతో.. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అప్పుడు మాకు యూట్యూబ్‌లో ఒక లింకు లభించింది. దీన్ని పరిశీలించగా.. ఇదొక షార్ట్ ఫిల్మ్ అని తెలిసింది.
‘కుమార్తె ఒక యువకుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోతుండగా.. ఆ విషయం తెలుసుకున్న తండ్రి, ఆమెను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం’ అంశంపై ఈ షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారు. SAI VIJAY అనే పేరుతో ఉన్న యూట్యూబ్ అకౌంట్‌లో మార్చి 19న ఈ వీడియోను పబ్లిష్ చేశారు. ‘Running Couple Part 7’ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ‘తండ్రి ఆమె కాళ్లపై పడి ఏడ్చాడు’ అనే అర్థంతో తమిళంలో దీనికి శీర్షిక ఇచ్చారు.
13.30 నిమిషాల నిడివితో ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్‌లో నిమిషం నిడివి గల పార్ట్‌ను కట్ చేసి (10.30 నిమిషాల వద్ద) సోషల్ మీడియాలో పోస్టు చేసి నిజంగా జరిగిన ఘటనగా పేర్కొంటున్నట్లు మా పరిశీలనలో తేలింది.
ఇది అసలు నిజం
కన్నకుమార్తె ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే వెళ్లొద్దని ప్రాధేయపడుతున్న తండ్రి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వాస్తవ ఘటన కాదు. తమిళంలో ఒక షార్ట్ ఫిల్మ్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ను నిజమైన ఘటనగా తప్పుదోవ పట్టించేవిధంగా షేర్ చేస్తున్నారు.
![]() |
![]() |