ఆసియా జెయింట్ చైనా టెక్నాలజీ రేసులో మరో కీలక ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఫ్లయింగ్ ట్యాక్సీలకు అనుమతి ఇచ్చింది. ఈ పైలట్ రహిత ఎగిరే ట్యాక్సీలకు వాణిజ్యపరమైన అనుమతి ఇస్తున్నట్టు చైనా సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈహ్యాంగ్ హోల్డింగ్స్, హెఫీ హే ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఎయిర్ ట్యాక్సీ ఆపరేటర్ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ మేరకు ఓ చైనా మీడియా సంస్థ కథనం వెలువరించింది. చైనా ఫ్లయింగ్ ట్యాక్సీలకు అనుమతి ఇవ్వడం ప్రపంచ సాంకేతిక రంగంలో పెను మార్పులకు నాంది పలకనుంది. డ్రోన్ ఆధారిత ఫ్లయింగ్ ట్యాక్సీల వాణిజ్య కార్యకలాపాలకు చైనా ప్రభుత్వం ఆమోదం తెలపడంతో, సాంకేతిక ఆధిపత్య పోరులో ఆ దేశం మరో ముందడుగు వేసినట్టయింది. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 6జీ నెట్‌వర్క్‌లతో పాటు తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు, బ్లింప్స్ (గాలితో నిండిన బెలూన్లు), ఫ్లయింగ్ కార్లను చైనా ప్రోత్సహిస్తోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ ఫ్లయింగ్ ట్యాక్సీల భద్రత, నియంత్రణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి సవాళ్లను చైనా ఎలా అధిగమిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ, ఈ పరిణామం ప్రపంచ సాంకేతిక రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.ప్రస్తుతం చైనాకు చెందిన ఒక జర్నలిస్ట్ పోస్ట్ చేసిన ఎయిర్ టాక్సీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
![]() |
![]() |