డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. అమెరికాలో ఎక్కువ కాలం పాటు ఉంటున్న విదేశీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని హోం శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. 30 రోజులకు మించి అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఫెడరల్ గవర్నమెంట్ వద్ద తమ పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై నేరారోపణలు మోపి, జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని అమెరికా హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే, వెంటనే అమెరికాను విడిచి వెళ్ళడమే ఉత్తమ మార్గమని సూచించింది.అమెరికాను వీడటానికి ఇదే సరైన సమయమని, సామాను సర్దుకుని స్వదేశానికి విమానం ఎక్కాలని హోం శాఖ సూచించింది. ఎటువంటి నేర చరిత్ర లేనివారు, ఇక్కడ సంపాదించుకున్న డబ్బుతో నిశ్చింతగా వెళ్లిపోవచ్చని తెలిపింది. ఒకవేళ ఎవరికైనా విమాన టికెట్ కొనుగోలు చేసే స్థోమత లేకపోతే, అమెరికా ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తుందని పేర్కొంది.నిబంధనలు పాటించని వారిని వెంటనే దేశం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. అంతేకాకుండా, బహిష్కరణ ఆదేశాలు అందుకున్న వారు ఒక్క రోజు ఎక్కువ సమయం ఉన్నా రోజుకు 998 డాలర్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, సొంతంగా వెళ్ళిపోకపోతే 1,000 నుండి 5,000 డాలర్ల వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. భవిష్యత్తులో వారు చట్టపరమైన మార్గాల ద్వారా కూడా అమెరికాలో మళ్లీ ప్రవేశించే అవకాశం కోల్పోతారని హెచ్చరించింది.ఈ నిబంధనలు ప్రధానంగా హెచ్1బీ మరియు విద్యార్థి వీసాలపై ఉండేవారికి వర్తించనప్పటికీ, సరైన అనుమతులు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారిపై మాత్రం కచ్చితంగా ప్రభావం చూపుతాయని తెలుస్తోంది. ఒకవేళ హెచ్1బీ వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోయిన వారు నిర్ణీత గడువు దాటి ఇక్కడ ఉంటే వారిపై చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు మరియు హెచ్1బీ వీసాదారులు అమెరికా చట్టాలు సూచించిన అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
![]() |
![]() |