కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు వైయస్ఆర్‌సీపీ సానుభూతి పరులు, కార్యకర్తలను చంపడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి తీవ్రంగా మండిపడ్డారు. ఈ రకమైన పరిపాలన దేశంలో ఎక్కడా లేదని ఆక్షేపించారు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను వేధించడానికే ప్రజలు అధికారం ఇచ్చారన్నట్టుగా నిత్యం దాడులతో రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన గాలికొదిలేసిందేకాక కక్షలు, కార్పణ్యాలతో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆరికెరిలో విధులు ముగించుకుని వస్తుండగా దారుణ హత్యకు గురైన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వీరన్న మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే... ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఎవరికీ హాని తలపెట్టిని వీరన్నపై టీడీపీ కార్యకర్తలే దాడి చేసి చంపారన్నారు. దాడి చేసిన వారు ఎవరైనా వారిని వదిలిపెట్టబోమని... తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. వైయస్.జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏనాడు ఇలాంటి ఘటనలు లేవని... చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఇలాంటి మారణహోమాన్ని ఆపాలన్న ఆయన... లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. జరిగిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని విరూపాక్షి డిమాండ్ చేశారు.