ఉక్రెయిన్ పై యుద్దానికి దిగిన రష్యా మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోనున్నది. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేటితో 20వ రోజుకు చేరుకుంది. రష్యా దాడి రోజురోజుకు మరింత భీకరంగా మారుతోంది. రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపానికి చేరుకున్నాయి. కీవ్‌పై బాంబులు, క్షిపణులతో దాడులు చేస్తున్నాయి. ఫలితంగా నగరం దద్దరిల్లుతోంది. ఈ క్రమంలో ఓ 15 అంతస్తుల భవనంపై జరిగిన దాడిలో భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురు భవనంలో చిక్కుకుపోయారు. పోడిల్‌స్కీలోనూ ఓ పదంతస్తుల భవనంపై రష్యా సేనలు దాడిచేశాయి. అలాగే, ఓ యూనివర్సిటీపైనా, ఓ మార్కెట్‌పైనా జరిగిన దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న బస్సుపైనా రష్యా దళాలు దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఖేర్సన్ నగరంలోనూ రష్యా సేనలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఆంటోపోల్‌లో టీవీ టవర్‌పై జరిగిన రాకెట్ దాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అమెరికాకు చెందిన ఫాక్స్‌న్యూస్ వీడియో జర్నలిస్ట్ పియెర్రే (55) ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, కీవ్‌కు 15 కిలోమీటర్ల దూరానికి రష్యన్ సేనలు చేరుకున్నాయి. ఈ దూకుడునుబట్టి చూస్తే మరో రెండుమూడు రోజుల్లో కీవ్.. రష్యా అధీనంలోకి వెళ్లే అవకాశం ఉంది. నాటో కూటమిలోని పోలండ్, చెక్, స్లోవేకియా దేశాధినేతలు నిన్న గుట్టుచప్పుడు కాకుండా కీవ్‌ను సందర్శించిన విషయం తెలిసిన రష్యా మరింతగా చెలరేగిపోతోంది. మరోవైపు, నాటో కూటమిలో చేరాలని ఆశపడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆవేదనాభరిత వ్యాఖ్యలు చేశారు. నాటో తలుపులు తెరిచే ఉంటాయని ఏళ్లుగా వింటూ వచ్చామని, కానీ ఇప్పుడు తాము దానిలో చేరలేమని తెలుసుకున్నామని, తమ ప్రజలు ఈ వాస్తవాన్ని గ్రహిస్తున్నారని అన్నారు.