కాంగ్రెస్ పార్టీ బలహీనత స్వయంగా తానే అన్నది ఇపుడు వరకు ప్రచారంలో ఉన్న మాట. ఇదే విషయాన్ని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గుర్తుచేశారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ 2024లో మాత్రం బీజేపీని చాలెంజ్ చేసే స్థాయికి ఎదుగుతుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. అయితే, అందుకు చేయాల్సిందల్లా ఏకతాటిపైకి రావడమేనని అన్నారు. కాంగ్రెస్ ఆ పనిని ఇప్పుడే ప్రారంభిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని సవాలు చేయగలిగే స్థాయికి ఎదుగుతుందని జోస్యం చెప్పారు. ‘ఇండియా టుడే’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ).. పార్టీలో నెలకొన్న సంస్థాగత బలనతలను పరిష్కరించడంతోపాటు పార్టీ నిర్మాణంలో సమగ్ర మార్పులు చేసేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియాకు పూర్తి అధికారం ఇచ్చింది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశం ఉందని పేర్కొన్న ప్రశాంత్ కిశోర్.. బీజేపీ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ బీహార్, బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి తూర్పు, దక్షిణ భారతదేశంలోని దాదాపు 200 స్థానాల్లో 50 కంటే ఎక్కువ సీట్లను సాధించేందుకు ఇప్పటికీ పోరాడుతోందని అన్నారు. కాంగ్రెస్‌కు పునర్జన్మ ఇవ్వాల్సిన అవసరం ఉందని పీకే అన్నారు. దాని ఆత్మ, ఆలోచనలు, భావజాలం అలానే ఉంటాయి కానీ, మిగతావన్నీ కొత్తగా ఉండాలని అన్నారు. గాంధీ కుటుంబం కాంగ్రెస్‌ను విడిచిపెట్టినా ఆ పార్టీ పుంజుకునే అవకాశం లేదని, కాబట్టి కాంగ్రెస్ డ్రాయింగ్ బోర్డుకు తిరిగి వెళ్లి ప్రాథమికాలను సరిచేయాల్సిన సమయం ఇదేనని పీకే వ్యాఖ్యానించారు. బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు షార్ట్‌కట్స్ ఏమీ లేదని, 10-15 ఏళ్ల దృక్కోణంతో ముందుకు వెళ్లడమే ఏకైక మార్గమని ప్రశాంత్ కిశోర్ తేల్చి చెప్పారు.