భారత మహిళా జట్టు ఆట తీరుపై క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. తాజగా మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్‌లో దారుణంగా నిరాశపరిచింది. ఇంగ్లండ్ బౌలర్ చార్లెట్ డీన్ దెబ్బకు బ్యాటింగ్ ఆర్డర్ కకావికలైంది. 36.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌కు ముందు విండీస్‌పై సింగాల్లా గర్జించిన స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు ఈ మ్యాచ్‌లో వరుసగా 35, 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. మరోవైపు, కెప్టెన్ మిథాలీరాజ్ మరోమారు తీవ్రంగా నిరాశపరిచింది. రిచాఘోస్ 33 పరుగులు చేయగా, జులన్ గోస్వామి 20 పరుగులు చేసింది. మిగతా వారిలో ఎవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లెట్ డీన్ 4 వికెట్లు పడగొట్టగా, ఆన్య శ్రుభ్‌సోల్ 2, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్ చెరో వికెట్ తీసుకున్నారు.